Tahawwur Rana: భారత్‌కు రేపు 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహావుర్ రాణా

India to Receive 2611 Mumbai Attack Mastermind Tahawwur Rana

  • గురువారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకునే అవకాశం
  • అప్పగింత కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్న అజిత్ ధోవల్, కేంద్ర హోంమంత్రిత్వశాఖ
  • రాణా అప్పగింతను ఫిబ్రవరిలోనే ధ్రువీకరించిన ట్రంప్

2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహావుర్ రాణాను రేపు భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, దర్యాప్తు అధికారులతో కూడిన బృందం రేపు తెల్లవారుజామున అమెరికా నుంచి భారత్‌కు తీసుకురానుందని సమాచారం. భారత్‌కు చేరుకున్న తర్వాత రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలోకి తీసుకుంటుంది. ఈ అప్పగింత కార్యక్రమాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.  

పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన రాణా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో చురుకైన పాత్ర పోషించాడు. ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టిన పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి ప్రయాణ పత్రాలు సులభంగా ఇప్పించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. అనంతరం పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీ నుంచి లాజిస్టిక్స్, వ్యూహాత్మక మద్దతుతో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు. 

ముంబై ఉగ్రదాడిలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. విచారణ అనంతరం అతడిని ఉరితీశారు. కాగా, ఈ దాడుల వెనుక సూత్రధారి రాణాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ జూన్ 2020లో అమెరికాను భారత్ అభ్యర్థించింది. అప్పగింతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది. రాణా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. తనను భారత్‌కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ తహావుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు.

Tahawwur Rana
26/11 Mumbai Attacks
David Coleman Headley
Lashkar-e-Taiba
Pakistan Inter-Services Intelligence (ISI)
Ajmal Kasab
India-US extradition
Terrorism
Mumbai Terror Attacks
  • Loading...

More Telugu News