Elephant steals wheat flour: సంతలో గోధుమ పిండి బస్తా చోరీ చేసిన ఏనుగు.. వీడియో ఇదిగో!

––
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ సమీపంలో ఓ ఏనుగు వారసంతలో చొరబడింది. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి నేరుగా సంతలోకి వచ్చిన ఏనుగు.. దర్జాగా ఓ అంగడి ముందు ఆగింది. రోడ్డు పక్కనే పెట్టిన గోధుమ బస్తాలలో నుంచి ఓ బస్తాను తొండంతో పట్టుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. బాగా ఆకలిగా ఉందో ఏమో కానీ అక్కడే ఆ బస్తాను నేలపై పడేసింది. సంచి పగిలిపోయి పిండి బయటపడడంతో తొండంతో తీసుకుని తినేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సంతలోని జనం భయాందోళనకు గురయ్యారు. అయితే, ఆ ఏనుగు ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండా గోధుమ పిండి తినేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.
ఇదంతా అక్కడే ఉన్న జనం తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. హరిద్వార్ సమీపంలోని బహద్రాబాద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బహద్రాబాద్ పక్కనే రాజాజీ టైగర్ రిజర్వ్ ఉంది. అప్పుడప్పుడు జంతువులు గ్రామంలోకి వచ్చి తిండి కోసం వెతకడం మామూలేనని, అయితే, ఇలా వార సంతలోకి ఏనుగు చొరబడి గోధమ పిండి తినడం మాత్రం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు చెబుతున్నారు.