Kandukuri Veeresalingam: కందుకూరి పురస్కారాల ఎంపికకు కమిటీ ఏర్పాటు .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

- నాటక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కందుకూరి పురస్కారాలు
- నాటక, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
- రాష్ట్రస్థాయిలో మూడు కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు
- ఒక్కో జిల్లాకు 5 చొప్పున మొత్తం 26 జిల్లాల్లో 130 జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాలు
ఈ నెల 16వ తేదీన ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో కందుకూరి పురస్కారాల ఎంపికకు నాటక, సినీ రచయిత, పరిషత్ నిర్వాహకులు డా.బుర్రా సాయిమాధవ్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రస్థాయిలో 3 కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారాలు, ఒక్కో జిల్లాకు 5 చొప్పున మొత్తం 26 జిల్లాల్లో 130 జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాలు అందించనున్నారు. ఈ క్రమంలో ప్రతిభ గల నాటక రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులను కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీలో నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, రచయిత, దర్శకుడు, కళాకారుడు డా. పాటిబండ్ల ఆనంద రావు, సాంఘిక, నాటక కళాకారులు చిక్కాల బాలాజీ, దర్శకుడు, రచయిత, కళాకారుడు కెకెఎల్ స్వామి, దర్శకుడు, కళాకారుడు పి బాలాజీ నాయక్, దర్శకుడు, రచయిత, కళాకరుడు దాసరి చలపతి రావు (గంగోత్రి సాయి), లలిత కళా సమితి అధ్యక్షురాలు, అడ్వకేట్ జి.పద్మజ, నాటక పరిషత్ నిర్వాహకులు, పరిషత్ సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు, మెంబర్ కన్వీనర్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా ఉన్నారు.
నాటక రంగంలో కృషి చేసిన వారికి రాష్ట్రస్థాయిలో కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదు, జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి కందుకూరి విశిష్ట పురస్కారంతో పాటు రూ. 10 వేల నగదును ఏప్రిల్ 16వ తేదీన అందించనున్నారు. కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.