MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో ధోనీ అరుదైన ఘనత.. తొలి వికెట్ కీపర్‌గా రికార్డ్!

- టోర్నీ చరిత్రలో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ
- నిన్న పీబీకేఎస్ తో మ్యాచ్‌లో నేహల్ వధేరా క్యాచ్ పట్టడం ద్వారా ఈ ఘనత
- 137 క్యాచ్‌లతో ఈ జాబితాలో రెండో స్థానంలో దినేశ్ కార్తీక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టోర్నీ చరిత్రలో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా ఎంఎస్‌డీ నిలిచాడు. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో నేహల్ వధేరా క్యాచ్ పట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
పీబీకేఎస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వధేరా... బ్యాట్ భారీ ఎడ్జ్ తీసుకోవడంతో ధోని ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఇక ధోనీ తర్వాతి స్థానంలో ఆర్‌సీబీ మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఉన్నాడు. 137 క్యాచ్‌లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇదే అతనికి తొలి ఐపీఎల్ సెంచరీ కూడా. మొత్తంగా 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 రన్స్ చేసి ఔటయ్యాడు.
కాగా, నిన్న ప్రియాంశ్ బాదిన శతకం టోర్నమెంట్ చరిత్రలో ఐదో వేగవంతమైన సెంచరీ. 2013లో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును కలిగి ఉన్నాడు.
ఇక ప్రియాంశ్ తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్‌కే 201 రన్స్‌కే పరిమితమైంది. దీంతో పంజాబ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో పీబీకేఎస్‌కు ఇది మూడో విజయం కాగా, చెన్నైకి నాలుగో ఓటమి.