Nurul Hassan: మణిపూర్ ఎమ్మెల్యేపై 100 మంది డ్రగ్ స్మగ్లర్ల దాడి

- ఈ నెల 5న ఘటన.. తన గొంతు కోసేందుకు ప్రయత్నించారన్న ఎమ్మెల్యే నూరుల్ హసన్
- పక్కా ప్రణాళికతోనే తనపై దాడి జరిగిందన్న ఎమ్మెల్యే
- నిందితులు తీవ్రమైన కేసుల్లో బెయిలుపై బయట ఉన్నవారేనన్న ఎమ్మెల్యే
డ్రగ్ స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మణిపూర్ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ఎమ్మెల్యే నూరుల్ హసన్ తాజాగా దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్మగ్లర్లు తనపై మెరుపుదాడి చేశారని గుర్తు చేసుకున్నారు. దాదాపు 100 మంది స్మగ్లర్లు దాడి చేశారని, తనపై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు. ముఠా తన చేతిని పట్టుకుని లాగి పడేసిందని, గొంతును కోయడానికి ప్రయత్నించిందని తెలిపారు.
హసన్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 5న ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. తన సోదరి ఇంట్లో జరిగిన ఫ్యామిలీ డిన్నర్ అనంతరం వస్తుండగా దాడి జరిగినట్టు వివరించారు. ‘‘నాపై హత్యాయత్నం జరిగింది. దాదాపు 100 మంది డ్రగ్ స్మగ్లర్లు నాపై దాడి చేశారు. ముందస్తు ప్రణాళికతోనే నాపై దాడి జరిగింది. తుపాకులు కూడా కాల్చారు’’ అని పేర్కొన్నారు.
దాడి సందర్భంగా తన ఛాతీపై ఉన్న గాయాన్ని చూపిస్తూ.. క్షేత్రిగావ్ హైస్కూల్ సమీపంలో మహ్మద్ అజ్మల్ నేతృత్వంలో ఓ ముఠా గుమికూడిందని అన్నారు. వారు తనను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, తన చేయి పట్టుకుని గొంతు కోసేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీంతో తన భద్రతా సిబ్బంది తనను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారని వివరించారు. అయినప్పటికీ వదలని ముఠా తనపై రాళ్లు విసురుతూ కాల్పులు ప్రారంభించిందని పేర్కొన్నారు. ముఠాలో ఒకడు తన నుదుటిపై తుపాకి గురిపెట్టాడని ఎమ్మెల్యే తెలిపారు.
అప్రమత్తమైన తన సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు కొన్ని బ్లాంక్ రౌండ్లు కాల్చిందని ఎమ్మెల్యే తెలిపారు. దాడికి అనుకూలంగా ఉండేలా స్ట్రీట్ లైట్లను కావాలనే ఆఫ్ చేశారని చెప్పారు. దీనిని బట్టి ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడేనని అర్థమవుతోందన్నారు. నిందితుల్లో అజ్మల్ సహా చాలామంది తీవ్రమైన కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై తాను పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.