Upasana Konidela: నా కూతురు కూడా నాలాగే పెరగాలి: ఉపాసన

- తన కూతురు తనలాగే నానమ్మ, తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నానన్న ఉపాసన కొణిదెల
- ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదని ఆవేదన
- గ్రాండ్ పేరెంట్స్ చేతుల్లో పెరగడం అందమైన అనుభవమని వ్యాఖ్య
రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల ఒకవైపు గృహిణిగా, మరోవైపు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) వైస్ చైర్‌పర్సన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"మా అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్" అని ఆమె అన్నారు. తాను తన గ్రాండ్ పేరెంట్స్ వద్ద పెరిగానని, వారి చేతుల్లో పెరగడం ఒక అందమైన అనుభవం అని అన్నారు. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మాత్రం అత్తమామలతో కలిసి ఉండటమే ఇష్టమని తెలిపారు. తన కుమార్తె కూడా తనలాగే నానమ్మ, తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
అప్పుడే తన కుమార్తె వారి వద్ద నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన అత్త, మామయ్యలు తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలిపారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుమార్తె మంచి వ్యక్తుల చేతుల్లో ఉందనే ధీమా ఉంటుందని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా మనవరాలి పట్ల అంతే ప్రేమను చూపిస్తారని అన్నారు. తమ కుటుంబ సభ్యులు అందరూ క్లీంకార ఎదుగుదలలో భాగమవుతున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.