Pawan Kalyan: సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్.. చిరంజీవి దంపతులు.. వీడియో ఇదిగో!

- సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్
- పెద్ద కుమారుడి పుట్టిన రోజు నాడే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధకరమన్న పవన్
- శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని ఆవేదన
సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ పయనమయ్యారు. సింగపూర్ వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పవన్, చిరంజీవి, సురేఖ కనిపించారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
కాగా, కుమారుడి గాయాలపై పవన్ స్పందించారు. ‘సమ్మర్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగి శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం చిన్నదేనని అనుకున్నానని, కానీ, తర్వాతే దాని తీవ్రత తెలిసిందన్నారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజు నాడే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ తెలిపారు.