Sudhakar Yadav: ఊడిపోవడానికి యూనిఫాం అరటితొక్క కాదు.. జగన్‌కు రామగిరి ఎస్సై సుధాకర్ కౌంటర్.. వీడియో ఇదిగో!

- తాను అధికారంలోకి వస్తే పోలీసుల యూనిఫాం ఊడదీస్తానని ఘాటు వ్యాఖ్యలు
- జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎస్సై సుధాకర్ యాదవ్
- జగన్ ఇస్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని కౌంటర్
- తాము ప్రజల పక్షానే ఉంటామని స్పష్టీకరణ
తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీసు యూనిఫాం అరటితొక్క కాదన్నారు. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారా? అని ప్రశ్నించారు. మీరిస్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు. కష్టపడి చదివి, పరుగు పందెంలో పాసై, వేలమంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇదని చెప్పారు. తాము నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తామని, అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని స్పష్టం చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని జగన్‌ను హెచ్చరించారు.
గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎస్పీ ఆధ్వర్యంలో వందలమంది పోలీసులతో బందోబస్తు కల్పించామని గుర్తు చేశారు. అయినా, ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని విమర్శించారు. జగన్ శిష్యులు తమ వద్ద తుపాకులు ఉన్నాయని.. ఎవరొస్తారో రావాలని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్యోగులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను సుధాకర్ యాదవ్ కోరారు.