Sreecharan Nallapareddy: ఏపీ నుంచి మరో క్రికెటింగ్ స్టార్... మమ్మల్ని గర్వించేలా చేశావు శ్రీ చరణి: చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

- శ్రీలంకలో మహిళల క్రికెట్ ముక్కోణపు సిరీస్
- శ్రీలంకతో పాటు టీమిండియా, దక్షిణాఫ్రికా అమీతుమీ
- నేడు టీమిండియా మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ
- టీమిండియాలో 20 ఏళ్ల శ్రీ చరణికి చోటు
కడప జిల్లాకు చెందిన క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి టీమిండియా మహిళల జట్టుకు ఎంపికవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
"ఆంధ్రప్రదేశ్ నుంచి మరో క్రికెటింగ్ స్టార్ అవతరించింది... ఈసారి కడప బిడ్డ మమ్మల్ని గర్వించేలా చేసింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు క్రికెట్ టోర్నీలో ఆడే టీమిండియా సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన నల్లపురెడ్డి శ్రీ చరణికి శుభాభినందనలు. ఆల్ ది బెస్ట్ అమ్మా" అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.
శ్రీ చరణి జాతీయ జట్టుకు ఎంపికవడం పట్ల నారా లోకేశ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. "ఇక శ్రీ చరణి హవా మొదలవుతుంది. నిన్ను చూసి కడప గర్విస్తోంది. ట్రై సిరీస్ లో ఆడే టీమిండియాకు నువ్వు ఎంపిక కావడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ లో ఇది గొప్ప పరిణామం. నువ్వు సాధించబోయే ఘనతల కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం" అంటూ నారా లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు శ్రీలంకలో మహిళల ముక్కోణపు క్రికెట్ టోర్నీ జరగనుంది. ఇందులో ఆతిథ్య శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఆడుతున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియా మహిళల జట్టును ఇవాళ ఎంపిక చేయగా, కడప అమ్మాయి శ్రీ చరణి ఎంపికైంది. 20 ఏళ్ల శ్రీ చరణి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్.