Sri Charani: ఎవరీ శ్రీ చరణి..?

ఏపీ క్రికెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ చరణి. కడప జిల్లాకు చెందిన ఈ 20 ఏళ్ల అమ్మాయి శ్రీలంకలో జరిగే ముక్కోణపు టోర్నీలో ఆడే టీమిండియా ఎంపికవడమే అందుకు కారణం. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ క్రికెటర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. విశేషం ఏంటంటే... శ్రీ చరణి ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ గడప తొక్కలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేవలం రెండు మ్యాచ్ లు ఆడిన అనుభవం ఆమెది. ఆ రెండు మ్యాచ్ ల్లో 4 వికెట్లు తీసి టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడింది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన శ్రీ చరణికి భారత స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం లభించడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ చరణి నేపథ్యం
శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన క్రికెటర్. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమెకు గతంలో WPLలో చోటు దక్కినప్పుడే తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పుడు టీమిండియాలో స్థానం లభించడంతో ఊరు ఊరంతా సంతోషంతో పొంగిపోతోంది. తమ ప్రాంతం నుంచి ఒకరు ఇంత గొప్ప వేదికపై ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గ్రామస్తులు గర్వపడుతున్నారు.
బ్యాటింగ్ కూడా చేయగలదు
గత ఏడాది అక్టోబర్ 22న వడోదరలో గోవా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో శ్రీ చరణి 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా, ఆమె బ్యాటింగ్ కూడా చేయగలదు.
ఎడమచేతి వాటం బ్యాటర్‌గా, WT20 కెరీర్‌లో 131.3 స్ట్రైక్ రేట్‌తో 84 పరుగులు చేసింది, అత్యధిక స్కోరు 22. చరణి తన కెరీర్‌లో 14 బౌండరీలు కొట్టింది, అందులో ఒక సిక్స్ కూడా ఉంది. బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే జట్టు కోసం రాణించాలని ఆశిస్తోంది.