Renu Desai: రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన రేణు దేశాయ్

- రాజకీయాల్లో తాను ఫిట్ కాననిపిస్తోందన్న రేణు దేశాయ్
- గతంలో అవకాశం వస్తే పిల్లల కోసం వదులుకున్నట్లు వెల్లడి
- ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా చెబుతానని స్పష్టీకరణ
రాజకీయాల్లో తాను సరిపోనని భావిస్తున్నానని నటి రేణు దేశాయ్ అన్నారు. ఒక పాడ్‌కాస్ట్‌లో రాజకీయ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ, గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం వదులుకున్నానని తెలిపారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని, కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నానని చెప్పారు.
ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని, ఏ ఒక్క చిన్నారి కూడా ఆకలితో ఉండకూడదని తాను కోరుకుంటానని అన్నారు. మన దేశంలో డబ్బుకు, ఆహారానికి కొదవ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అలవాటు ఉందని, ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని, దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని రేణూ స్పష్టం చేశారు.
అకీరాను రామ్ చరణ్ సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారనే వార్తలపై రేణు దేశాయ్ స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని ఆమె కొట్టిపారేశారు. అకీరా ప్రస్తుతం 'ఓజీ' సినిమాకు పనిచేయడం లేదని కూడా స్పష్టం చేశారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజున తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెడతానని ఆమె తెలిపారు.