Tedros Adhanom Ghebreyesus: ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది... అది ఎప్పుడైనా రావొచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్

- ఆ మహమ్మారి ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమన్న టెడ్రోస్
- కరోనా సృష్టించిన విలయం అందరం చూశామని వెల్లడి
- పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ఎదురు చూడదని వ్యాఖ్య
ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. మరో మహమ్మారి అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓ పాండెమిక్ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసనాలను గుర్తు చేశారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని, అది ఎప్పుడైనా సంభవించవచ్చని హెచ్చరించారు.
అందుకు ఇరవై ఏళ్లు పట్టవచ్చు లేదా రేపే సంభవించవచ్చని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
కరోనా సృష్టించిన విలయాన్ని మనమందరం చూశామని, ఈ మహమ్మారి కారణంగా అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని చెప్పినప్పటికీ, ఆ సంఖ్య 2 కోట్లు దాటి ఉంటుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని ఆయన పేర్కొన్నారు.