Pawan Kalyan: పవన్ కాన్వాయ్ వల్ల జేఈఈ విద్యార్థులకు పరీక్ష ఆలస్యమైందనడం అవాస్తవం: విశాఖ సీపీ

- నిన్న విశాఖలో జేఈఈ పరీక్ష
- పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న కొందరు విద్యార్థులు
- పవన్ కాన్వాయ్ కారణంగానే ఆలస్యమైందంటూ ఆరోపణలు
- విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్
- ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన విశాఖ సీపీ
విశాఖలో నిన్న నిర్వహించిన జేఈఈ పరీక్షకు పలువురు విద్యార్థులు ఆలస్యం కావడం, అందుకు పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణం అంటూ దుమారం రేగడం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటనకు వచ్చారని, ఆయన కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారంటూ విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో, తన కాన్వాయ్ కారణంగా పెందుర్తిలో విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరు కాలేకపోయారనే వార్తలపై విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ను నిలిపారు, పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులు వెళ్లే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి, సర్వీసు రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించారా వంటి అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆయన విశాఖ పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలోనే విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఈ ప్రకటన చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ (మెయిన్) పరీక్షకు హాజరు కాలేకపోయినట్లు పెందుర్తికి చెందిన కొందరు విద్యార్థులు చేసిన ఆరోపణలను సీపీ ఖండించారు. విద్యార్థుల ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
"డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా మేము ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి," అని అన్నారు. విద్యార్థులే ఆలస్యంగా వచ్చారని, ఆపై పోలీసులపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల సెల్‌ఫోన్‌లను కూడా ట్రాక్ చేశామని సీపీ తెలిపారు. "పోలీసుల వల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్న తర్వాతే డిప్యూటీ సీఎం కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లింది" అని శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.