Kavitha Kalvakuntla: ఏఐతో కాదు... అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం: కవిత

Kavitha Kalvakuntla Accuses Revanth Reddy Warns of Anumula Intelligence

  • రాష్ట్రంలో అనుముల ఇంటెలిజెన్స్ విధ్వంసం సృష్టిస్తోందన్న కవిత
  • కాంగ్రెస్ నేతల్లా మేం ఢిల్లీలో దొంగ దీక్షలు చేయబోమన్న కవిత
  • ఢిల్లీలో దీక్ష చేస్తే కేంద్రానికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలని వ్యాఖ్య

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని బీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం కవిత మంగళవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. వారు పక్కకు తప్పుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ పని అని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో కులగణన జరిగిందని, ఆ వివరాలు కూడా బహిర్గతం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల్లా తాము ఢిల్లీలో దొంగ దీక్షలు చేయబోమని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధిక దీక్ష చేస్తామని ఆమె అన్నారు.

బిల్లులను ఆమోదించి నాలుగు వారాలవుతోందని, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటో చెప్పాలని కవిత నిలదీశారు. బిల్లుల ఆమోదం తర్వాత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆ పనిచేయలేదని విమర్శించారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి స్నేహం ఉందని, అందుకే అఖిలపక్షాన్ని తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి ఢిల్లీ దీక్షలో తెలుగులో మాట్లాడారని, కానీ అక్కడ దీక్ష చేస్తే కేంద్రానికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11న పూలే విగ్రహంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Kavitha Kalvakuntla
Telangana Politics
Revanth Reddy
Anumula
BRS
Congress
BJP
Phule Statue
Indira Park
Delhi Protest
  • Loading...

More Telugu News