Somu Veeraju: మంత్రి పదవిపై సోము వీర్రాజు ఏమన్నారంటే...!

- మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యేవాడినన్న వీర్రాజు
- కూటమిలో బీజేపీ చేరడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని వెల్లడి
- తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత వీర్రాజు తొలిసారి రాజమండ్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి కావాలనే కోరిక లేదని... మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యేవాడినని చెప్పారు. ఎంతో నిబద్ధతతో బీజేపీ కోసం పనిచేశానని తెలిపారు. ఈ జీవితానికి ఇది చాలని అన్నారు.
దేశంలో దమ్మున్న మగాడు ప్రధాని మోదీ అని సోము వీర్రాజు కితాబునిచ్చారు. ఏపీలో కూటమిలో బీజేపీ కలవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆక్వా రైతుల సమస్యలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు, సోము వీర్రాజు రాజమండ్రి రాక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ నుంచి స్టేడియం రోడ్డు, బైపాస్ రోడ్డు, జైలు రోడ్డు మీదుగా మంజీరా హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వీర్రాజుకు గజమాలలు వేశారు. బాణసంచా, తీన్మార్ డ్యాన్సులతో సందడి చేశారు. ర్యాలీలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితర నేతలు పాల్గొన్నారు. అనంతరం అభినందన సభ జరిగింది. ఈ సభలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.