Kadiam Srihari: ఆరోపణలు నిరూపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో గులాంగిరీ చేస్తాను: కడియం శ్రీహరి

- 2 వేల ఎకరాలను కబ్జా చేశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
- కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్
- తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్న కడియం
తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ టి. రాజయ్య ఇంట్లో గులాంగిరీ చేస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దేవునూరు గుట్టలను తాను ఆక్రమిస్తున్నానంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోపణలను తోసిపుచ్చారు.
తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తాను 2 వేల ఎకరాలను కబ్జా చేశానని చెబుతున్నారని మండిపడ్డారు. బినామీలకు భూములను అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీహరి వాపోయారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నాపై చేసిన ఆరోపణలు తప్పయితే బీఆర్ఎస్ నేతలు నాకు గులాంగిరీ చేస్తారా? అని ప్రశ్నించారు.