Nara Lokesh: ఏపీలో ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కార్యక్రమం

- ఇంటింటికీ మన మిత్ర
- వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కార్యక్రమం
- ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించనున్న సచివాలయ సిబ్బంది
- పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగింత
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ విధానం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టనున్నారు.
గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి... వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఎలా పొందాలనే విషయమై ప్రజలకు వివరించనున్నారు. వారు ప్రజల మొబైల్ ఫోన్ లో 955230009 నెంబరును 'మన మిత్ర' పేరిట సేవ్ చేయనున్నారు. 'మన మిత్ర' కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ను ఉపయోగించుకునేలా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 250కి పైగా సేవలు అందిస్తోంది. జూన్ నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ తర్వాత ఆ సేవలను 1000కి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.