ఫోన్ ట్యాపింగ్ కేసు... కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ పోలీసులు

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావే కీలకమని కౌంటర్ దాఖలు 
  • ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడని వెల్లడి
  • ప్రభాకరరావు బెయిల్ పిటిషన్ కొట్టివేసి, దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసుల వినతి 
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావే కీలకమంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యంగా ఎస్‌వోటీ విధులు నిర్వహించిందని, ఎస్ఐబీలో ఎస్‌వోటీని నెలకొల్పింది ప్రభాకర్ రావేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఇది పని చేసిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావు చట్టపరంగా దర్యాప్తునకు సహకరించలేదని వెల్లడించారు. 

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడన్నారు. హైదరాబాద్‌కు వస్తున్నాన్నంటూ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారని, దాదాపు తొమ్మిది నెలలు గడిచినా భారత్‌కు తిరిగి రాలేదని పీపీ కోర్టుకు వివరించారు. కావున ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసి, పోలీసు దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు పోలీసుల తరపున పీపీ విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.  


More Telugu News