Meenakshi Natarajan: తెలంగాణ సచివాలయంలో మీనాక్షి షాడో ముఖ్యమంత్రిగా సమీక్షలు చేస్తున్నారు: జీవన్ రెడ్డి

- రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గోల్లు గిల్లుకుంటున్నారని ఎద్దేవా
- ఏఐసీసీ పెద్దల దృష్టిలో రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టు అని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి తోకను కత్తిరించి పక్కన పెట్టారని వ్యాఖ్య
- కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సచివాలయంలో షాడో ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గోళ్లు గిల్లుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం పెరిగిందని ఆరోపించారు. ఏఐసీసీ పెద్దల దృష్టిలో రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టు అని, ఆయనను రాహుల్ గాంధీ కూడా నమ్మడం లేదని అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి తోకను కత్తిరించి పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డిని అదుపు చేసేందుకు రాహుల్ గాంధీ దూతగా మీనాక్షి నటరాజన్ వచ్చారని అన్నారు. ఆమె ఏ హోదాలో సచివాలయంలోకి అడుగు పెట్టారో చెప్పాలని నిలదీశారు. సచివాలయంలో సమావేశాలు పెట్టాల్సిన ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో, గాంధీ భవన్‌లో సమావేశాలు పెట్టాల్సిన మీనాక్షి నటరాజన్ సచివాలయంలో పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు బడేబాయ్‌తో చోటేబాయ్ స్నేహం చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో డీల్ చేసుకున్నాకే తెలంగాణలోని విశ్వవిద్యాలయాల భూములను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి వారు ముఖ్యమంత్రికి రక్షణ కవచంలా నిలుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి బీఆర్ఎస్ ఇంటి పార్టీ అని, అలాంటి పార్టీని ఓడించినందుకు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఎన్నికల హామీలలో దాదాపు అన్నింటికి ఎగనామం పెట్టారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే హామీలకు సమాధి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి అమ్ముడుపోవడం అలవాటేనని, అందుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడే భాయ్‌కి చోటే భాయ్ తోఫా ఇచ్చాడని చురక అంటించారు.
కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ, రేవంత్ రెడ్డి అంటే అమ్మకమని తెలంగాణ ప్రజలు గుర్తించారని అన్నారు. హెచ్‌సీయూ భూములని అమ్ముకోనిస్తే రేవంత్ రెడ్డికి పట్టపగ్గాలుండవని హెచ్చరించారు. విశ్వవిద్యాలయాల భూముల అమ్మకం తర్వాత కళాశాలల భూముల అమ్మకానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక వాటిని తిరిగి తీసుకుంటామని కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు.