Donald Trump: 'పానికన్' గా ఉండొద్దు: ట్రంప్ ఆసక్తికర ట్వీట్

- ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచిన ట్రంప్
- సొంత దేశంలోనే తీవ్రస్థాయిలో నిరసనలు
- అమెరికన్లకు హితవు పలుకుతూ ట్వీట్
రెండో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ లు పెంచడం ద్వారా సంచలనం సృష్టించారు. అయితే, ప్రపంచ దేశాల మాట అటుంచితే, సొంత దేశంలోనే ట్రంప్ విధానాలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా అమెరికా వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారు. దీనిపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు.
"ఎప్పుడో దశాబ్ద కాలం కిందట చేయాల్సిన పని ఇది... ఆ పనిచేసేందుకు ఇప్పుడు మన ముందు అవకాశం నిలిచింది. ఇలాంటి సమయంలో బలహీనులుగా మారొద్దు. మూర్ఖంగా తయారు కాకండి... పానికన్ (బలహీనులు, మూర్ఖులు ఉండే కొత్త పార్టీ)గా ఉండకండి. బలంగా, ధైర్యంగా, ఓపికగా ఉండండి... ఫలితం ఎంత గొప్పగా ఉండబోతోందో చూడండి" అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
కాగా, ట్రంప్ చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చైనాపై 34 శాతం టారిఫ్ విధించారు.