YS Sharmila: ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం బాధాకరం: షర్మిల సెటైర్

YS Sharmilas Scathing Attack on YCP

  • వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన షర్మిల
  • పచ్చకామెర్ల రోగం ఇంకా తగ్గినట్టు లేదని వ్యంగ్యం 
  • ఏపీలో కాంగ్రెస్ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శలు

వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు... కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్టు లేదు అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు గారు కనిపించడం చాలా బాధాకరం... అంటూ సెటైర్ విసిరారు. మేం ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం అని విమర్శించారు. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం అని షర్మిల ధ్వజమెత్తారు.

చెప్పుతో కొట్టినా మీరు మారలేదు

11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా... మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు... ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయ్యింది. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ప్యాలెస్ లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు. 

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారు. రుషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోదీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోదీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదాని (మోదీ+అదానీ) సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడింది. ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదు. పులి బిడ్డ  పులిబిడ్డే. 

బీజేపీ అంటే... బాబు, జగన్, పవన్!

ఈ రాష్ట్రంలో BJP అంటే బాబు, జగన్, పవన్.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుంది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసిన మా ఆరోపణలు వినపడకపోవడం మీరు చెవిటోళ్లు అనడానికి... పోలవరం ప్రాజెక్ట్ విషయంలో  మా ఆవేదన కనపడకపోవడం మీరు గుడ్డోళ్ళు అనడానికి నిదర్శనం. 

కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు!

మీకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు ? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు ? మీ నీచపు కుయుక్తులతో, పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్ప... ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం... అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

YS Sharmila
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Congress Party
TDP
BJP
Indian Politics
AP Congress Chief
Political Satire
YS Rajasekhar Reddy
  • Loading...

More Telugu News