Jagan Mohan Reddy: ఊరికే లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు: చంద్రబాబుపై జగన్ విమర్శలు

Jagans Sharp Criticism of Chandrababu Naidu on Aquaculture Crisis

  • ట్రంప్ టారిఫ్ వార్
  • ఏపీలో ఆక్వా రంగం దెబ్బతింటోందంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ
  • ఆక్వా రంగం సంక్షోభంలో ఉంటే చంద్రబాబు నిద్రపోతున్నారా అంటూ జగన్ ఆగ్రహం

ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? అని మండిపడ్డారు. ట్రంప్ టారిఫ్ ల ప్రభావం ఆక్వా రంగంపై పడుతోందని, కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై జగన్ స్పందించారు.

రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? అని జగన్ నిలదీశారు. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? అని విమర్శనాస్త్రాలు సంధించారు.

"100 కౌంట్‌ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్‌ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? 

ఎగుమతుల్లోనూ, అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్‌ వన్‌. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్‌, ఫీడ్‌ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీచేసే విధానాలకు చెక్‌ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. 

కోవిడ్‌ సమయంలో దాదాపు ఐదేళ్ల క్రితం 100 కౌంట్‌కు, ఆ రోజుల్లో కనీస ధరగా రూ.210లు నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచాం. మూడుసార్లు ఫీడ్‌ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్‌ ఆయిల్‌, సోయాబీన్‌ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15% నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్‌ ధరలు ఒక్కపైసా కూడా తగ్గలేదు.

గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్‌ పరిధిలో కేవలం 80-90 వేల ఎకరాలు ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్‌ పరిధిలోకి 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64 వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉంటే అందులో జోన్‌ పరిధిలో ఉన్న 54 వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చుచేశాం. 

ఆక్వాజోన్స్‌లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్‌ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి, ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి  పరిష్కారం చూపించాం. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు" అంటూ జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు.

Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
Aquaculture Crisis
Shrimp Prices
US Tariffs
Aqua farmers
Agriculture
Fish Farming
Economic Crisis
  • Loading...

More Telugu News