Indian Government: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు.. కానీ..!

- పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని రూ. 2 చొప్పున పెంచిన కేంద్రం
- అయితే, పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని వెల్లడి
- పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి
దేశవ్యాప్తంగా సోమవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. ఈ పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో మాత్రం ఎటువంటి పెరుగుదల ఉండదని ప్రభుత్వం వెల్లడించింది.
ఇక ఈ పెంపు అనేది ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 13కి పెరిగింది. డీజిల్‌పై లీటరుకు రూ. 10కి పెరిగింది.
కాగా, ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ ప్రతీకార సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఇంధనంపై ఎక్సైజ్ సుంకం అనేది దేశంలోని వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను.
అయితే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి లేదా దిగుమతి సమయంలో చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి ప్రభుత్వం కొంతమేర వసూలు చేస్తుంది. ఇది కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరు కూడా.