Mahesh Kumar Goud: బీజేపీని 8 స్థానాల్లో గెలిపిస్తే కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన నిధులు సున్నా: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

- బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీత
- మెట్రోకు నిధులు అడిగితే ఇవ్వలేదని ఆరోపణ
- మూసీ పునరుజ్జీవానికి నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదన్న టీపీసీసీ చీఫ్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 8 స్థానాల్లో గెలిపిస్తే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రోకు నిధులు కోరితే ఇవ్వలేదని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవనానికి నిధులు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
విభజన చట్టంలోని హామీల గురించి కేంద్ర మంత్రులు ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని నిలదీశారు.
తెలంగాణలోని ప్రాజెక్టుల గురించి బీజేపీ నేతలు ఒక్కసారి కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎప్పుడూ రహస్య బంధం ఉందని విమర్శించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వేలాది ఎకరాలు అమ్మేసిందని, లక్ష ఎకరాలను డీఫారెస్ట్ చేస్తే ఎందుకు అడగలేదని బీజేపీ నేతలను ఆయన నిలదీశారు.