Nara Lokesh: మీరు నా గౌరవం, పరువు నిలబెట్టారు... మీ కోసం అహర్నిశలు శ్రమిస్తా: మంత్రి నారా లోకేశ్

- మంగళగిరిలో మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమం
- పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేశ్
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి
మంగళగిరిని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని, నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. 'మన ఇల్లు - మన లోకేశ్' కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం ప్రజలకు యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు ఆవరణలో పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, నివసిస్తున్న ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వాలన్నది ఎన్నో ఏళ్ల కల అని అన్నారు. గతంలో జిరాక్స్ కాగితాలకే వేలకు వేలు ఖర్చు అయ్యేవని, ఇప్పుడు ఆ కష్టం తీరిందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇంటి పట్టాలు ఇస్తున్నామని తెలిపారు.
మూడు రకాల భూములు ఉండగా, తొలి విడతలో 3 వేల మందికి పట్టాలు అందిస్తున్నామని, రెండో విడతలో ఎండోమెంట్, రైల్వే భూముల్లో నివసించేవారికి, మూడో విడతలో అటవీ, ఇరిగేషన్ భూముల్లో నివసించేవారికి పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 3 వేల మందికి బట్టలు పెట్టి మరీ అయిదు రోజులపాటు నిలబడి పట్టాలు ఇస్తున్నానని, ఇది ప్రజల మీద తనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని లోకేశ్ అన్నారు.
ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసింది
మంగళగిరిలో పోటీ చేయాలనే నిర్ణయమే నా జీవితాన్ని మార్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, మంగళగిరి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవని పథకం ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నాం, మహిళలు స్వంత కాళ్లపై నిలబడేందుకు కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేస్తున్నాం. పిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో పాటు మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభించాం. పేద ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు బట్టలు పెట్టాం, కోవిడ్ సమయంలో ఆక్సిజన్, మందులు అందజేశాం, అమెరికా డాక్టర్లతో టెలిమెడిసిన్ సేవలు అందించాం.
మీరు కొట్టిన దెబ్బకు అక్కడనుంచి సౌండ్ లేదు
నేను ఓడిపోయినపుడు అందరూ ఎగతాళి చేశారు. ఇటీవల ఎన్నికల్లో మీరు కొట్టిన దెబ్బకు అక్కడనుంచి సౌండ్ లేదు. ఎన్నికలపుడు అందరూ సర్వేలు చేస్తారు. టీడీపీ సర్వేలో కూడా కుప్పం కంటే మంగళగిరి వెనకబడి ఉంది. ఎన్నికలయ్యాక చంద్రబాబును కలిశా, మీకన్నా ఒక్క ఓటు అయినా ఎక్కువ వస్తుందని చెప్పా. చెప్పినట్లే అత్యధికంగా 91 వేల మెజారిటీతో గెలిచా. మీరు నా గౌరవం, పరువు నిలబెట్టారు, మీ కోసం అహర్నిశలు శ్రమిస్తా. ఇంటిపట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజి, నీరు, భూగర్భ గ్యాస్, కరెంటు కార్యక్రమాలు కూడా చేపట్టాం, టెండర్లు నడుస్తున్నాయి. జూన్ నుంచి పనులు ప్రారంభమవుతాయి. లక్ష్మీనరసింహస్వామి గుడిని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. మహా ప్రస్థానం పేరుతో శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. పద్ధతి ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాం.
భారీ మెజారిటీ వల్లే చర్చ లేకుండా ఆమోదం
భారీ మెజారిటీతో గెలిపించినందునే నేను తీసుకెళ్లే ప్రతిపాదనలకు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం తెలుపుతున్నారు. రెండవ కేబినెట్ సమావేశంలోనే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి వచ్చింది. ఈ నెల 13న ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నాం.