Varsha Kharat: వీడ్కోలు సభలో మాట్లాడుతూనే గుండెపోటుతో విద్యార్థిని మృతి.. వీడియో ఇదిగో!

Student Dies of Heart Attack During Farewell Speech

  • స్టేజీపైనే కుప్పకూలిన విద్యార్థిని.. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూత
  • ఎనిమిదేళ్ల వయసులో గుండెకు శస్త్రచికిత్స.. 
  • ఆ తర్వాత 12 ఏళ్లుగా ఎలాంటి అనారోగ్యం లేదంటున్న తల్లిదండ్రులు

మహారాష్ట్రలోని ఓ కళాశాలలో జరిగిన విద్యార్థుల వీడ్కోలు సభలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని వేదికపై ప్రసంగిస్తుండగా గుండెపోటుకు గురై కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోగా కన్నుమూసింది. ఈ విషాదం ధారాశివ్‌ జిల్లాలోని పరండా పట్టణంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవరికీ తెలియదంటూ నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

కళాశాల యాజమాన్యం, విద్యార్థిని స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. పరండాలోని ఆరాజీ షిండే కాలేజీలో ఆదివారం ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ జరిగింది. ఈ వేడుకలో ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్(20) మాట్లాడారు. కాలేజీతో అనుబంధాన్ని, లెక్చరర్లతో తమ సరదా సంఘటనలను గుర్తుచేసి తోటి విద్యార్థులను నవ్వించింది. జూనియర్లకు విలువైన సూచనలు చేసింది. వేదికపై ప్రసంగిస్తుండగానే వర్ష ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన తోటి విద్యార్థులు, లెక్చరర్లు వర్షను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

అయితే, గుండెపోటుతో వర్ష అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. వర్ష తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిదేళ్ల వయసులో వర్షకు గుండె ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి గడిచిన పన్నెండు సంవత్సరాలలో వర్ష ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. గుండె ఆరోగ్యంగా ఉందని, మందులు కూడా వాడాల్సిన అవసరంలేదని వైద్యులు చెప్పారన్నారు. అలాంటిది అకస్మాత్తుగా వర్షకు గుండెపోటు రావడం, ఆసుపత్రికి తరలించే లోపే చనిపోవడంతో వారు కన్నీటిపర్యంతం అవుతున్నారు. వర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. వర్షకు నివాళిగా కాలేజీకి ఒకరోజు సెలవు ప్రకటించింది.

Varsha Kharat
Heart Attack
College Farewell
Student Death
Paranda
Dhule
Maharashtra
Viral Video
Sudden Death
Tragic Incident
  • Loading...

More Telugu News