హనుమకొండలో కాకినాడ బుకీ అరెస్ట్

  • ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు కట్టిస్తున్న వీరమణికుమార్
  • హనుమకొండలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వారిచ్చిన సమాచారంతో కాకినాడకు చెందిన వీరమణి అరెస్ట్
  • పరారీలో హైదరాబాద్ బుకీ యోగేశ్‌గుప్తా
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీ హనుమకొండలో అరెస్టయ్యాడు. హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. పది రోజుల క్రితం హనుమకొండ పద్మాక్షికాలనీలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బుకీగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వీరమణికుమార్‌ను నిన్న హనుమకొండలో అరెస్ట్ చేశారు. 

2023లో వీరమణికుమార్ గోవా వెళ్లగా అక్కడ హైదరాబాద్‌కు చెందిన బుకీ యోగేశ్‌గుప్తాతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌‌ల గురించి చెప్పి బెట్టింగ్‌లు కట్టిస్తే వచ్చిన లాభంలో 9 శాతం ఇస్తానని యోగేశ్‌గుప్తా హామీ ఇచ్చాడు. అందుకు వీరమణి అంగీకరించడంతో యాప్ లింక్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చాడు. 

వీరమణి అప్పటి నుంచి పలువురితో బెట్టింగ్‌లు కట్టిస్తున్నాడు. ఈ బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా వీరమణి బాగానే సంపాదించాడు. అతడి బ్యాంకు ఖాతాల్లో రూ. 5 కోట్ల వరకు జమ అయింది. అందులో యోగేశ్‌కు రూ. 3 కోట్లు ఇచ్చాడు. బెట్టింగ్‌లలో గెలిచిన వారికి కోటి రూపాయలు ఇచ్చాడు. మిగిలిన కోటి రూపాయలతో కాకినాడలో ఒక ఫ్లాటు కొనుగోలు చేశాడు. అలాగే, రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. వీరమణిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి రూ. 1.5 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న యోగేశ్ గుప్తా కోసం గాలిస్తున్నారు.


More Telugu News