Sunrisers Hyderabad: పడుతూ లేస్తూ 152 పరుగులు చేసిన సన్ రైజర్స్

- కొనసాగుతున్న సన్ రైజర్స్ బ్యాటింగ్ కష్టాలు
- గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లోనూ కొట్టొచ్చినట్టు కనిపించిన బ్యాటింగ్ వైఫల్యం
- 31 పరుగులు చేసిన నితీశ్ కుమార్
- సిరాజ్ కు 4 వికెట్లు
ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఏకంగా 286 పరుగులు చేసి ఔరా అనిపించిన సన్ రైజర్స్.. తర్వాతి మ్యాచ్ లో 300 కొట్టడం ఖాయమని అందరూ భావించారు. ఇప్పుడా ఒత్తిడే సన్ రైజర్స్ కొంపముంచుతోంది. కనీసం 200 పరుగులు కూడా చేయలేక ఎస్ఆర్ హెచ్ టీమ్ ఉసూరుమనిపిస్తోంది.
ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఆడిన తీరు సన్ రైజర్స్ బ్యాటింగ్ వైఫల్యానికి మరో నిదర్శనంలా నిలుస్తుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆపసోపాలు పడుతూ ఈ మాత్రం స్కోరు చేసింది.
తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి చేసిన 31 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. హెన్రిచ్ క్లాసెన్ 27, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 నాటౌట్ (9 బంతుల్లో), అనికేత్ వర్మ 18, ఇషాన్ కిషన్ 17 పరుగులు చేశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) మరోసారి విఫలం కాగా... లోయరార్డర్ లో వచ్చిన కమిందు మెండిస్ 1 పరుగుకే వెనుదిరిగాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2, సాయి కిశోర్ 2 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుండడంతో టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ కూడా విచ్చేశారు. వెంకీ స్టేడియంంలో సాధారణంగా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటారు. కానీ ఇవాళ సన్ రైజర్స్ ఆటగాళ్లు అడపాదడపా కొట్టే బౌండరీలకు ఆయన తన చేతిలో ఉన్న జెండా ఊపుతున్నారే కానీ, ముఖంలో ఆ జోష్ కనిపించలేదు. వికెట్లు టపటపా పడుతుండడంతో వెంకీ మామా నిరాశకు గురయ్యారు.
ఇక, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యజమాని కావ్యామారన్ సంగతి సరేసరి. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఇంత పేలవంగా ఆడుతుండడం పట్ల ఆమె దిగ్భ్రాంతికి గురైనట్టు టీవీలో కనిపించింది.