Digvesh Rathee: సెలబ్రేషన్ పై చర్చ.... దిగ్వేష్ రాఠీ, సునీల్ నరైన్ ఫన్నీ ఫన్నీగా... వీడియో ఇదిగో!

ఐపీఎల్ తాజా సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ క్రికెటర్లలో లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ ఒకడు. దిగ్వేష్ రాఠీ పొదుపుగా బౌలింగ్ చేస్తూ, కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక బౌలర్ గా అవతరించాడు. ఇటీవల ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఓ వికెట్ పడగానే నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకుని, భారీ జరిమానాకు గురయ్యాడు. ఈ విధంగా కూడా రాఠీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏప్రిల్ 8న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం లక్నో జట్టు కోల్ కతా చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రాక్టీస్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దిగ్వేష్ రాఠీ, కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తో మాట కలిపాడు. వీరిద్దరికీ మధ్య నికోలాస్ పూరన్ సంధానకర్తలా వ్యవహరించాడు.
సునీల్ నరైన్ తన ఆదర్శ బౌలర్ అని దిగ్వేష్ రాఠీ చెప్పగా... అతడు (సునీల్ నరైన్) వికెట్ తీసినప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోడు... మరి నువ్వెందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు? అని పూరన్ సరాదాగా రాఠీని ప్రశ్నించాడు. అందుకు దిగ్వేష్ రాఠీ చెప్పిన సమాధానం అక్కడ నవ్వులు పూయించింది. "ఎందుకంటే నేను ఢిల్లీ వాడ్ని కాబట్టి" అంటూ ధీమాగా సమాధానం చెప్పాడు. దాంతో అందరూ నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో క్రికెట్ లవర్స్ ను ఆకర్షిస్తోంది.