Kolikapudi Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి పరాభవం!

- ఎమ్మెల్యే కొలికపూడిని పలకరించని సీఎం చంద్రబాబు
- హెలిప్యాడ్ వద్ద ఇతర నేతలతో కలిసి నమస్కారం చేసినా చూసి చూడనట్లు పక్క నేతలను పలకరించి ముందుకు సాగిన సీఎం
- ముభావంగా ఉండిపోయిన కొలికపూడి
నియోజకవర్గంలో వరుస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారిన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు నందిగామ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పరాభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
ఆ సమయంలో ముఖ్యమంత్రి తన వద్దకు రాగానే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆయనకు నమస్కరించారు. అయితే చంద్రబాబు ఆయనను పట్టించుకోకుండా పక్కనున్న నేతను భుజం తట్టి పలకరించారు. అదే సమయంలో టీడీపీ మహిళా నేతలు అక్కడకు రావడంతో చంద్రబాబు వారితో ముచ్చటించారు. కొలికపూడి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. ఇతర నేతలు ముందుకు రావడంతో కొలికపూడి వెనక్కు వెళ్లిపోయి నిల్చుండిపోయారు.
ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలను పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొలికపూడి విషయంలో ఇలా వ్యవహరించడంతో ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో కొలికపూడి ముభావంగా ఉండిపోయారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కొలికపూడి తీరుపై ఆగ్రహంగా ఉంది.