Kerala Company Employee Abuse: ఉద్యోగుల మెడకు గొలుసు కట్టి కుక్కల్లా నడిపించిన కంపెనీ.. వీడియో ఇదిగో!

Kerala Companys Cruel Punishment of Employees Sparks Outrage
  • కేరళలోని ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య
  • నేలపై నాణేలు పడేసి నాలుకతో తీయించిన వైనం
  • విచారణకు ఆదేశించిన కేరళ కార్మికశాఖ మంత్రి
తక్కువ పనితీరు కనబరుస్తున్న కొందరు ఉద్యోగులకు ఓ ప్రైవేటు కంపెనీ విధించిన శిక్షపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలోని కలూర్‌కు చెందిన ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులపై అమానవీయంగా ప్రవర్తించింది. ఉద్యోగుల మెడకు కుక్క గొలుసులు కట్టి వారిని మోకాళ్లపై నడిపించి, నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయించింది. టీవీ చానళ్లలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో సదరు కంపెనీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ ఘటనపై స్పందించిన కేరళ కార్మికశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి ఆ కంపెనీపై విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అయితే, కంపెనీ మాత్రం దీనిని కొట్టిపడేసింది. టీవీ ఫుటేజీలో కనిపించిన ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. తమ కంపెనీలో అలాంటి వేధింపులు జరగలేదని, ఆ దృశ్యాలు ఇప్పటివి కావని, కొన్ని నెలల కిందటివని చెప్పారు. అప్పట్లో మేనేజర్‌గా ఉన్న వ్యక్తి బలవంతంగా అలా చిత్రీకరించారని, యాజమాన్యం ఆయనను తొలగించిందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు కావాలనే ఆ వీడియోలను బయటపెట్టారని వివరించారు. కార్మికశాఖ, పోలీసుల ముందు కూడా ఆయన ఇదే వాంగ్మూలం ఇచ్చారు. 

అయితే, మరికొందరు ఉద్యోగులు మాత్రం లక్ష్యాలను సాధించడంలో విఫలమైన వారికి మాత్రం ఇలాంటి శిక్షలు విధించడం నిజమేనని చెప్పారు. సంస్థ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను ఖండించినట్టు పోలీసులు తెలిపారు. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Kerala Company Employee Abuse
Dog Collar Punishment
V. Sivankutty
Cruel Treatment of Employees
Marketing Company
Human Rights Violation
India Workplace Abuse
Calicut
Employee Rights
Workplace Harassment

More Telugu News