Valeria Rao: ఇంటి అద్దెలు తగ్గించాలని స్పెయిన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు

- స్పెయిన్‌లో సామాజిక సమస్యగా మారిన ఇళ్ల సంక్షోభం
- మాడ్రిడ్, బార్సెలోనా సహా అనేక నగరాల్లో నిరసనలు
- ఇంటి అద్దె 50 శాతం తగ్గించాలని డిమాండ్
- మాడ్రిడ్ నిరసనల్లో పాల్గొన్న 1.5 లక్షల మంది
స్పెయిన్‌లో గృహ సంక్షోభం నేపథ్యంలో వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. స్పెయిన్‌లో ఇళ్ల అద్దెలు భరించలేనంతగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అద్దెలను 50 శాతం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మాడ్రిడ్‌లో జరిగిన నిరసనల్లో దాదాపు 1.5 లక్షల మంది పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా 40 నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
‘హౌసింగ్ రాకెట్’ను అంతమొందించాలని, ఇంటి యజమానులే దోషులని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాడ్రిడ్ అద్దెదారుల సంఘం ప్రతినిధి వలేరియా రాకు మాట్లాడుతూ కాటలాన్ తీర ప్రాంత పట్టణాల్లో పెరిగిపోతున్న అద్దెలపై సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ‘ఇంటి వ్యాపారం ముగింపునకు ఇది నాంది’ అని పేర్కొన్నారు. మన జీవితాలను, మన వనరులను మింగివేసే ఈ పరాన్న జీవి వ్యవస్థ లేకుండా మెరుగైన సమాజానికి ఇది నాంది కావాలని ఆకాంక్షించారు.
1.4 మిలియన్ల స్పానిష్ కుటుంబాలు తమ ఆదాయంలో 30 శాతానికిపైగా ఇంటి అద్దెలకు చెల్లిస్తున్నారు. స్పెయిన్‌లో ఇటీవల గృహ సంక్షోభం అతిపెద్ద సామాజిక సమస్యగా మారింది. ఆస్తి ఊహాగానాలు (మూలధన లాభాలను పొందాలనే ఆశతో ఆస్తిని అమ్మడం, లేదా కొనడం), పర్యాటక అపార్ట్‌మెంట్ల అద్దెలు పెరగడమే ఇందుకు కారణం.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం మాడ్రిడ్‌లో కనీసం 15 వేల టూరిస్ట్ అపార్ట్‌మెంట్లు అనధికారికంగా నడుస్తున్నాయి. స్పెయిన్‌లో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో 30 ఏళ్లలోపున్న 85 శాతం మంది యువత ఇప్పటికీ తమ తల్లిదండ్రులతోనే నివసిస్తున్నారు. బార్సెలోనాలో జరిగిన ఆందోళనల్లో ఇంటి అద్దెలను 50 శాతం తగ్గించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలాగే, నిరవధిక లీజులు ఇవ్వాలని, ఆస్తి ఊహాగానాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.