Chandrababu Naidu: చదువు మాత్రమే జీవితాలను మార్చుతుందని వారికి చెప్పాను: సీఎం చంద్రబాబు

- ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- ముప్పాళ్ల గ్రామంలో బాలికల హాస్టల్ సందర్శన
- విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నానన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముప్పాళ్ల గ్రామంలోని బాలికల హాస్టల్ ను కూడా సందర్శించారు. తన పర్యటన గురించి చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.
"ముప్పాళ్ల గ్రామంలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, అక్కడి పాఠశాలను సందర్శించాను. విద్యాభ్యాసానికి అనుకూలమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అక్కడ కల్పించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి వారి ఆలోచనలు, అవసరాలు తెలసుకున్నాను. విద్యార్థినులతో సంభాషణ ఎంతో ఉత్సాహంగా సాగింది. భవిష్యత్తు పట్ల వారి ఆలోచన చూసి నాకు ఎంతో ముచ్చటేసింది.
హాస్టల్ కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించాను. సరుకుల నాణ్యతను పరిశీలించాను. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా.... ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నాను. వారు చెప్పిన సమాధానాలు సంతృప్తిని కలిగించాయి.
బాగా చదువుకోవాలని, చదువు మాత్రమే జీవితాలను మార్చుతుందని వారికి చెప్పాను. వారికి నా ఆశీస్సులు అందించాను" అని చంద్రబాబు వివరించారు.



