హమ్మయ్య... ఎట్ట‌కేల‌కు మ‌హేశ్ చేతికి పాస్‌పోర్టు.. విదేశాల‌కు సూప‌ర్‌స్టార్‌.. ఇదిగో వీడియో!

మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి కాంబోలో 'ఎస్ఎస్ఎంబీ29' ప్రాజెక్టు
ఇటీవ‌లే ఒడిశాలో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న మూవీ
కాస్త బ్రేక్ దొర‌క‌డంతో త‌న ఫ్యామిలీతో క‌లిసి మ‌హేశ్ ఫారిన్ ట్రిప్‌  
ఎయిర్‌పోర్టులో స‌ర‌దాగా త‌న పాస్‌పోర్ట్ చూపించిన సూప‌ర్‌స్టార్‌
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఎస్ఎస్ఎంబీ 29 (వ‌ర్కింగ్ టైటిల్‌) అనే మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఒడిశాలో మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ భారీ ప్రాజెక్టు త‌ర్వాతి షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో కాస్త బ్రేక్ దొర‌క‌డంతో హీరో మ‌హేశ్ బాబు త‌న ఫ్యామిలీతో క‌లిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లిపోయారు. 

అయితే, ఆ మ‌ధ్య‌లో మ‌హేశ్ పాస్‌పోర్టు లాక్కున్న‌ట్టు జ‌క్క‌న్న పోస్టు చేసిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్‌ను సింహాన్ని బోనులో పెట్టిన‌ట్టు బంధించి ఆయ‌న పాస్‌పోర్టును లాక్కున్న‌ట్టు ద‌ర్శ‌క‌ధీరుడు ఫొటోకు పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ద‌ర్శ‌కుడు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డంతో అది కాస్త వైర‌ల్‌గా మారింది. 

ఇప్పుడు మ‌హేశ్ విదేశాల‌కు వెళుతూ, విమానాశ్ర‌యంలో ఫొటోగ్రాఫ‌ర్ల‌కు త‌న పాస్‌పోర్టును చూపించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీగా స్పందిస్తున్నారు. 
 
కాగా, ఎస్ఎస్ఎంబీ 29లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ వంటి టాప్ స్టార్లు న‌టిస్తున్నారు.  ఈ సినిమా ఓ అడ్వెంచర్ యాక్ష‌న్‌ డ్రామాగా ఉండ‌బోతుంద‌ని ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కాబోతున్నార‌ని స‌మాచారం. 

దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత కేఎల్ నారాయ‌ణ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌క్క‌న్న అన్ని సినిమాల‌కు బాణీలు అందించిన‌ ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.  


More Telugu News