నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ!

  • ఢిల్లీ కేపిటల్స్‌తో నేడు చెన్నైలో మ్యాచ్
  • రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
  • నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమే
ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్‌తో చెపాక్‌లో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్రసింగ్ ధోనీ నడిపించనున్నట్టు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండటం అనుమానంగా ఉంది. రుతురాజ్ కనుక మ్యాచ్‌కు దూరమైతే కెప్టెన్‌గా ధోనీ జట్టును ముందుండి నడిపిస్తాడు. గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు ట్రైనింగ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అవసరమైతే ధోనీకి పగ్గాలు అప్పగిస్తామని జట్టు బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ తెలిపాడు. 

నేటి మ్యాచ్ కోసం గైక్వాడ్ ట్రైనింగ్‌లో బ్యాట్ పడతాడని ఆశిస్తున్నామని హస్సీ తెలిపాడు. గాయం నుంచి గైక్వాడ్ కోలుకుంటున్నాడని, కాబట్టి జట్టుకు అందుబాటులో ఉండటంపై ఆశాజనకంగానే ఉన్నట్టు చెప్పాడు. మరి, గైక్వాడ్ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికిస్తారన్న ప్రశ్నకు హస్సీ బదులిస్తూ.. నిజానికి దీని గురించి తాము ఆలోచించలేదని, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌, రుతురాజ్ దీని గురించి ఆలోచిస్తారని పేర్కొన్నాడు.   

కాగా, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీకి మంచి పేరుంది. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌కు నాయకత్వం వహించిన రికార్డు ధోనీ పేరునే ఉంది. 266 మ్యాచుల్లో జట్టును నడిపించగా అందులో 133 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించింది. 2008లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కేను ధోనీ పది సార్లు ఫైనల్స్‌కు నడిపించాడు. ఐదుసార్లు విజయం సాధించి ట్రోఫీ అందుకున్నాడు. 


More Telugu News