Chandrababu Naidu: ప్రతి నియోజకవర్గంలోనూ వంద పడకల ఆసుపత్రి: ఏపీ సీఎం చంద్రబాబు

- వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్న సీఎం
- ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 100 పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని సీఎం చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వైద్యసేవలను మరింత విస్తృత పరచాలని చెప్పారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు.
విద్య-వైద్య రంగాలు తమ ప్రాధాన్యాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలని తెలిపారు.
అనారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా బీపీ, షుగర్ వంటి వ్యాధుల నుంచి చాలా వరకు బయటపడవచ్చని అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు.