Kollu Ravindra: నూతన మైనింగ్ పాలసీతో సమస్యలకు చెక్: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

- మైనింగ్ రంగం ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి రవీంద్ర
- ప్రకాశం జిల్లా గొల్లాపల్లిలో బిల్డింగ్ మెటీరియల్ సెజ్ లో పర్యటన
- గ్రానైట్ కటింగ్, క్వార్జ్ నుంచి భవన సామాగ్రి తయారీ యూనిట్లను పరిశీలించిన మంత్రి రవీంద్ర
ఆంధ్రప్రదేశ్‌లో నూతన మైనింగ్ పాలసీతో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గొల్లపల్లిలో బిల్డింగ్ మెటీరియల్ సెజ్‌లో రవీంద్ర పర్యటించారు. గ్రానైట్ కటింగ్, క్వార్జ్ నుంచి భవన సామాగ్రి తయారీ యూనిట్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో 1,500 పైగా మైనింగ్ సంస్థలు ఉన్నాయన్నారు. ఒంగోలు సెజ్‌లో వందకు పైగా ప్లాంట్లు వస్తున్నాయని చెప్పారు. ప్రాసెసింగ్ రంగంలో విస్తారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రం నుంచి వివిధ ఖనిజాల ఎగుమతితో ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. మైనింగ్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. మైనింగ్ రంగం ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.