Hardik Pandya: రికార్డు సృష్టించిన హార్దిక్ పాండ్యా.. అయినా ఓడిన ముంబై

- ముచ్చటగా మూడో ఓటమిని నమోదు చేసిన ముంబై
- ఐపీఎల్‌లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా పాండ్యా రికార్డు
- సూర్యకుమార్, నమన్ ధిర్ రాణించినా తప్పని ఓటమి
ఐపీఎల్‌లో రెండు వరుస ఓటముల తర్వాత విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఆ ఊపును కొనసాగిస్తుందని అభిమానులు భావించారు. అయితే, వారి ఆశలను అడియాసలు చేస్తూ లక్నో చేతిలో ఓడి ముచ్చటగా మూడో ఓటమిని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో మరింత కిందికి దిగజారింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో విజయాన్ని నమోదు చేసింది.
లక్నో నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 191 పరుగులకు పరిమితమై ఓటమి పాలైంది. సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 67 పరుగులు, నమన్ ధిర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులతో రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. తిలక్ వర్మ 25, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మచెల్ మార్ష్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు, మార్కరమ్ 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేశారు. ఆయుష్ బదోనీ 30 పరుగులు చేశారు. లక్నో దూకుడుకు హార్దిక్ పాండ్యా అడ్డుకట్ట వేశాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ మరింత స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన పాండ్యా 36 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా పాండ్యా రికార్డులకెక్కాడు. అలాగే, అతడి టీ20 కెరియర్‌లోనూ ఇదే తొలిసారి. కాగా, నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన లక్నో బౌలర్ దిగ్వేష సింగ్ రాఠీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది.
ఐపీఎల్‌లో నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరగనుండగా, పంజాబ్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.