YV Subba Reddy: వక్ఫ్ బిల్లును వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ముందా.. టీడీపీకి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్

- టీడీపీ విమర్శలను ఖండించిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
- బిల్లును తాము వ్యతిరేకించామనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన కార్యకలాపాలే సాక్ష్యమని వెల్లడి
- ఫేక్ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు టీడీపీకి ఉందని కౌంటర్
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైసీపీ డబుల్ గేమ్ ఆడి ముస్లింలను మోసం చేసిందంటూ టీడీపీ, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన టీడీపీకి సవాల్ విసిరారు.
వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో తాము వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా? అని సవాల్ విసిరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ పార్టీ విప్ జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వక్ఫ్ సవరణ బిల్లును తాము వ్యతిరేకించామనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన కార్యకలాపాలే సాక్ష్యమని, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై తాను చేసిన ప్రసంగం మరో ప్రత్యక్ష సాక్ష్యమని వైవీ పేర్కొన్నారు. బిల్లును వైసీపీ వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా అని ఆయన నిలదీశారు. ఫేక్ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు టీడీపీకి ఉందని వైవీ విమర్శించారు.