Uttam Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రభుత్వం వెళుతోందని విమర్శ
- రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్లతో తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని వ్యాఖ్య
- ఏపీ తీరుతో సాగునీరు, తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయం
సన్నబియ్యం పంపిణీ ఒక చరిత్రాత్మక నిర్ణయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. దాదాపు 80 శాతం మంది పేదలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని ఆయన సూచించారు. శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీలో అవకతవకలకు ఏమాత్రం ఆస్కారం ఉండకూడదని ఆయన అధికారులను ఆదేశించారు.