Kasireddy Rajasekhar Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... కసిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

- విచారణకు హాజరు కావాలంటూ కసిరెడ్డికి సీఐడీ నోటీసులు
- నోటీసులను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన కసిరెడ్డి
- కసిరెడ్డి నోటీసులను కొట్టివేసిన హైకోర్టు
ఏపీలో వైసీపీ హయాంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్షిగా తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ అధినేత జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సీఐడీ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది.
ఈ క్రమంలో సీఐడీ నోటీసులను ఏపీ హైకోర్టులో కసిరెడ్డి సవాల్ చేశారు. సీఐడీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. సీఐడీ నోటీసులపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కసిరెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది.
మరోవైపు ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మద్యం కుంభకోణంపై గత ఏడాది సెప్టెంబర్ 23న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి పేరును చేర్చకపోయినప్పటికీ... ఆయనపై ఆరోపణలు వినిపిస్తుండటంతో... హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు.
అయితే, కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, ఆయనపై నేరారోపణలు లేవని, ఇలాంటి పరిస్థితిలో ఆయనను అరెస్ట్ చేస్తారనే ఆందోళన అవసరం లేదని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.