బీఎస్ఎన్ఎల్ స‌రికొత్త రీఛార్జ్ ప్లాన్‌... రూ. 251తో 251 జీబీ డేటా

  • 60 రోజుల కాల‌ప‌రిమితితో 251 జీబీ డేటా 
  • ఈ ఐపీఎల్ సీజ‌న్ ల‌క్ష్యంగా డేటా వోచ‌ర్ ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ 
  • యాక్టివ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా 2నెల‌లు డేటాను వాడుకునే వెసులుబాటు
ప్ర‌భుత్వ‌రంగ టెలికాం ఆపరేటర్ సంస్థ‌ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌) ఐపీఎల్ అభిమానుల‌కు శుభవార్త చెప్పింది. రూ.251 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది డేటా వోచర్... అంటే ఇందులో మరే ఇతర సేవలు (కాలింగ్‌, ఎస్ఎంఎస్‌) ఉండవు.

ఈ ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మొబైల్ డేటాను ఎక్కువగా వినియోగించే వినియోగ‌దారుల‌ను లక్ష్యంగా చేసుకుని రూ.251 డేటా వోచర్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్‌ తీసుకొచ్చింది. రూ. 251తో 251 జీబీ డేటా వ‌స్తుంది.

యాక్టివ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా 60 రోజుల కాల‌ప‌రిమితితో 251 జీబీ డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే, చెల్లుబాటు అయ్యే బేస్ ప్లాన్ లేకుండా ఈ డేటా వోచర్‌ను యాక్టివేట్ చేయడం సాధ్యం కాదు. ఇక ఇటీవల బీఎస్ఎన్ఎల్‌ నెలకు రూ. 999 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇది 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5000 జీబీ డేటాను అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ మాత్రమే కాకుండా ఎయిర్‌టెల్‌ కూడా ఇటీవల ఉచిత జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తో రెండు కొత్త క్రికెట్ ప్లాన్లను ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఎయిర్‌టెల్‌ నుంచి రూ.100 రీఛార్జ్ ప్లాన్ మొత్తం 5జీబీ డేటాతో పాటు జియో హాట్‌స్టార్ కు ఒక నెల ఉచిత యాక్సెస్ ను అందిస్తోంది. అలాగే రూ.195 ధర గల మరో ప్లాన్ 15జీబీ డేటాతో పాటు 90 రోజుల జియో హాట్‌స్టార్ ఉచిత‌ సబ్స్క్రిప్షన్ ను అందిస్తోంది.


More Telugu News