Mohammad Qasim Ansari: జేడీయూలో చిచ్చు పెట్టిన వక్ఫ్ బిల్లు

JDU Leaders Resign Over Waqf Bill

  • పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు
  • బిల్లుకు మద్దతుగా నిలిచిన నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ
  • పార్టీకి రాజీనామా చేసిన ఇద్దరు కీలక నేతలు

అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాల మధ్య వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ బిల్లు నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ బిల్లుకు జేడీయూ మద్దతు తెలపడంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో జేడీయూ సీనియర్ నేత మొహమ్మద్ ఖాసిం అన్సారీ, జేడీయూ మైనార్టీ వింగ్ అధ్యక్షుడు మొహమ్మద్ అష్రఫ్ అన్సారీ ఉన్నారు. 

ఈ సందర్భంగా ఖాసిం అన్సారీ మాట్లాడుతూ... వక్ఫ్ బిల్లుకు సంబంధించి కేంద్రానికి జేడీయూ మద్దతుగా నిలవడం ఎంతో బాధించిందని చెప్పారు. తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా బిల్లు ఉందని అన్నారు. తన ఎన్నో ఏళ్ల జీవితాన్ని జేడీయూకి ఇచ్చానని తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ సెక్యులర్ సిద్ధాంతాలు కలిగిన వారని లక్షల మంది ముస్లింలు నమ్ముతారని... ఇప్పుడు ఆ నమ్మకం ముక్కలయిందని చెప్పారు. జేడీయూ నిర్ణయం ముస్లింలను కలచివేస్తోందని అన్నారు. వక్ఫ్ బిల్లు ముస్లింలకు పూర్తి వ్యతిరేకమని అన్నారు.

వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఖాసిం అన్సారీ తెలిపారు. ఈ బిల్లు ద్వారా ముస్లింలు అవమానానికి గురయ్యారని... ఈ విషయం మీకు కానీ (నితీశ్ కుమార్), మీ పార్టీకి కానీ అర్థం కాదని చెప్పారు. జేడీయూ కోసం ఇంత కాలం పని చేసినందుకు ఎంతో చింతిస్తున్నానని అన్నారు.

Mohammad Qasim Ansari
JD(U)
Nitish Kumar
Waqf Board Bill
Indian Politics
Muslim Leaders
Bihar Politics
Resignation
Controversial Bill
Religious Politics
  • Loading...

More Telugu News