Karnataka Food Safety: ఐస్ క్రీంలో డిటర్జెంట్ పౌడర్, కూల్ డ్రింకుల్లో విష రసాయనాలు.. ఎక్కడంటే?

- కర్ణాటకలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ
- ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీలలో దారుణ విషయాలు వెలుగులోకి
- 220 దుకాణాలలో తనిఖీలు, 97 మంది యజమానులకు నోటీసులు
వేసవి తాపం తట్టుకోలేక చల్లటి ఐస్ క్రీం చప్పరిస్తున్నారా? చల్లచల్లటి కూల్ డ్రింక్ తాగి వేడి నుంచి ఉపశమనం పొందాలని అనుకుంటున్నారా? ఒక్క క్షణం ఆగండి! ఈ విషయం తెలుసుకోండి. ఐస్ క్రీం తయారీలో పాల ఉత్పత్తులు వాడతారని తెలిసిందే. కానీ, బెంగళూరులో మాత్రం డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారట. ఒక్క బెంగళూరులోనే కాదు.. కర్ణాటకలో స్థానికంగా తయారయ్యే ఐస్ క్రీంలలో దాదాపు సగం వరకూ ఇలా బట్టలు శుభ్రం చేసే పౌడర్ తో తయారైనవేనని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిపిన తనిఖీలలో ఈ భయంకరమైన విషయం బయటపడిందన్నారు. అంతేకాదు, స్థానికంగా తయారయ్యే శీతల పానీయాల్లో విషతుల్యమైన రసాయనాలను కలుపుతున్నారని, ఈ డ్రింకులు తాగితే ఎముకలు బలహీనంగా మారతాయని హెచ్చరించారు.
బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల రెండు రోజుల పాటు 220 దుకాణాలను, ఫ్యాక్టరీలను తనిఖీ చేశామని అధికారులు తెలిపారు. ఇందులో చాలా చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలోనే ఐస్ క్రీంలు, ఐస్ క్యాండీలు, శీతల పానీయాలు తయారవుతున్నాయని చెప్పారు. డిటర్జెంట్ పౌడర్, యూరియా తదితర పదార్థాలను ఉపయోగించి పాలను తయారు చేస్తున్నారని, వాటిని ఐస్ క్రీములు, క్యాండీలు తయారీలో వాడుతున్నారని తెలిపారు. దీంతో 97 దుకాణాలు, ఫ్యాక్టరీలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారుచేస్తున్న మిగతా కంపెనీలను హెచ్చరించి, పద్ధతులు మార్చుకోవాలని సూచించామని చెప్పారు.