Prashant Haridas: ఉద్యోగ వేటలో విసిగిపోయి లింక్డిన్ లో తను మరణించినట్లు పోస్టు పెట్టిన నిరుద్యోగి

Unemployed Mans Unique Protest Death Announcement on LinkedIn

  • మూడేళ్లుగా జాబ్ కోసం వెతుకుతున్నట్లు ఆవేదన
  • ఆత్మహత్య చేసుకోబోనని స్పష్టం చేసిన యువకుడు
  • ఉద్యోగ వేటకు సంబంధించిన ప్రయత్నాలు చనిపోయాయని వివరణ

నిరుద్యోగుల కష్టాలను తెలియజేసే పోస్టు ఒకటి లింక్డిన్ లో వైరల్ గా మారింది. మూడేళ్లుగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటూ, ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా ఫలితం లేకపోవడంతో నిస్పృహ చెందిన బెంగళూరు యువకుడు సోషల్ మీడియాలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. లింక్డిన్ లో తనకు తాను ‘మరణించినట్లు’ పోస్ట్ పెట్టాడు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ తన ఫోటోను అప్ లోడ్ చేశాడు. ఉద్యోగం కోసం తాను చేసిన విఫలయత్నాలకు సహకరించిన లింక్డిన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఇంటర్వ్యూలలో తనను తిరస్కరించిన వారికి సెటైరికల్ గా ధన్యవాదాలు తెలిపాడు. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ హరిదాస్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే, తనకు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశమేమీ లేదని ఈ పోస్టులో హరిదాస్ స్పష్టం చేశాడు. జీవితం అంటే తనకు ఎంతో ప్రేమ అని, ఇంకా తాను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని వివరించాడు. తను భోజనం చేయాల్సిన హోటళ్లు, సందర్శించాల్సిన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తన ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పేందుకే సింబాలిక్ గా ఈ పోస్ట్ పెట్టానని వివరించాడు.

ఈ పోస్టును చూసి తనకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారనే ఆశ తనకు లేదని, ఆ ఉద్దేశంతో తానీ పోస్టు పెట్టలేదని తెలిపాడు. లింక్డిన్ లో పెట్టిన హరిదాస్ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది. చాలామంది తమకు తోచిన సలహాలు, ఉద్యోగ ఖాళీల వివరాలను కామెంట్లలో తెలియజేశారు. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించడం ఎంత కష్టమో తమకు తెలుసని పేర్కొన్నారు. అయితే, ప్రయత్నాలను మాత్రం ఆపవద్దని సూచించారు.

Prashant Haridas
LinkedIn
Job Hunt
Unemployment
Viral Post
Bengaluru
Rest in Peace
Social Media
Job Search
India
  • Loading...

More Telugu News