Virgin Atlantic: 40 గంటలుగా ఎదురుచూపులే..!

- లండన్ నుంచి ముంబై వస్తూ తుర్కియేలో చిక్కుకుపోయిన 250 మంది ప్రయాణికులు
- విమానంలో సాంకేతిక లోపం వల్లే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందన్న ఎయిర్ లైన్స్
- ప్రయాణికులకు వసతి, భోజన సదుపాయం కల్పించినట్లు వివరణ
లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా తుర్కియేలో దిగింది. దియార్ బాకిర్ విమానాశ్రయంలో దిగి గంటలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదని, దాదాపు 40 గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. విమానాశ్రయంలో కనీస వసతులు కూడా లేవని, 250 మందికి ఒకే ఒక్క టాయిలెట్ ఉందని చెప్పారు. చలిని తట్టుకోవడానికి కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమాన ప్రయాణికులకు ఎదురైందీ అనుభవం. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
విమర్శలు వెల్లువెత్తుతుండడంతో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే అత్యవసరంగా తుర్కియేలో దించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రయాణికులు, తమ సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని చెప్పింది. విమానాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారని, మరమ్మతులు పూర్తయ్యాక శుక్రవారం మధ్యాహ్నం విమానం తిరిగి బయలుదేరుతుందని తెలిపింది. ప్రయాణికులకు రాత్రిపూట హోటల్ లో బస, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. తమ ప్రయాణికులను ముంబై చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది.