వీడిన హెల్త్ సూపర్ వైజర్ హత్యకేసు మిస్టరీ!

  • ఈ నెల 31న అర్ధరాత్రి పార్థసారథి హత్య
  • ప్రియుడితో కలిసి భర్త హత్యకు రూ. 5 లక్షలతో సుపారీ
  • గతంలోనూ ఓసారి భర్త హత్యకు విఫలయత్నం
  • భార్య, ప్రియుడి అరెస్ట్.. పరారీలో మిగిలిన నిందితులు
మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామ పరిధిలోని భజనతండా సమీపంలో గత నెల 31న అర్ధరాత్రి జరిగిన హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్యకేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలిసి భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు.

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలంలోని జగదీశ్‌ కాలనీకి చెందిన పార్థసారథి మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లిలోని జ్యోతిరావుపూలే పాఠశాలలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే ఆయన ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య స్వప్న, పిల్లలు మాత్రం ఊర్లోనే ఉంటున్నారు. మరోవైపు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగికి చెందిన సొర్లాం వెంకట విద్యాసాగర్ భద్రాచలంలో ఉంటూ ఎటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో స్వప్నకు, విద్యాసాగర్‌కు మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర బంధంగా మారి 9 ఏళ్లుగా కొనసాగుతోంది. విషయం తెలిసిన పార్థసారథి పలుమార్లు భార్యను హెచ్చరించాడు. ఇద్దరి మధ్య గొడవలు, పంచాయితీలు కూడా జరిగాయి. దీంతో భర్తపై పగ పెంచుకున్న స్వప్న భర్తను అడ్డు తొలగించుకుంటే విద్యాసాగర్‌తో కలిసి ఉండొచ్చని భావించింది. దీంతో గతంలోనూ ఒకసారి పార్థసారథి హత్యకు యత్నించి విఫలమయ్యారు.

దీంతో ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేశారు. కొత్తగూడేనికి చెందిన తెలుగూరి వినయ్‌కుమార్‌, శివశంకర్‌, ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాకకు చెందిన వంశీ, రాజమండ్రి జిల్లా జడ్డంగికి చెందిన కూసం లవరాజ్‌లతో కలిసి పార్థసారథి హత్యకు ప్లాన్ చేశారు. ఇందుకోసం రూ. 5 లక్షల సుపారీ ఇచ్చారు. గత నెల 31న సాయంత్రం పార్థసారథి తన బైక్‌పై దంతాలపల్లి వెళుతుండగా భజనతండా శివార్లలో కాపుకాసిన నిందితులు పార్థసారథిపై దాడిచేశారు. ఇనప రాడ్లతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్వప్న, విద్యాసాగర్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.


More Telugu News