Nara Lokesh: అందుకే రెడ్ బుక్ పేరెత్తాను: మంత్రి నారా లోకేశ్

Nara Lokeshs Red Book Remark Sparks Controversy

  • మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమం
  • పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
  • రెడ్ బుక్ పేరు చెబితే వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా

రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చిందని, మరొకరు బాత్రూమ్ లో పడి చేయి విరగ్గొట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. తాను రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని లోకేశ్ స్పష్టంచేశారు. 

మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేసిందని, తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. తాము ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు తాళ్లు కట్టలేదని, తప్పుడు కేసులు బనాయించడం లేదని వ్యాఖ్యానించారు. 

తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే రెడ్ బుక్ పేరు చెప్పా

కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 35 వేల మంది ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పొట్టచేతబట్టుకొని వలసలు వెళ్లారు. యువగళం పాదయాత్ర సమయంలో అక్కడ వలసలను నివారిస్తానని హామీ ఇచ్చా. ఆ మాటమేరకు కనిగిరిలో తొలి రిలయన్స్ సీబీజీ ప్లాంటు ఏర్పాటుచేశాం. 

అక్కడ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 50 వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు తమ రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దానిపై రిలయన్స్ డైరక్టర్ స్పందించి 50 ప్లాంట్లు అక్కడే ఏర్పాటుచేస్తామని అన్నారు. 

కరవు ప్రాంతంలో పెద్దఎత్తున యువతకు ఉపాధి కల్పించేందుకు ఇటువంటి ప్రాజెక్టులు తెస్తుంటే వైసీపీ వారికి కడుపు మంట దేనికి? బొబ్బలు వస్తాయంటూ దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ర్పచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే అటువంటి వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తానని చెప్పా.

జగన్ కు సొంతవాళ్లను కలిసేందుకే తీరికలేదు

సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వారు మాకు చెబుతారా? ప్రిజనరీ ఆలోచనలన్నీ జైలువైపే ఉంటాయి. తప్పుచేశారు కనుక ఆయన ధైర్యంగా ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటే ఎక్కువ సెక్యూరిటీ జగన్ కు కల్పించాం. 

అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరినీ కలవలేదు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తరువాత కూడా కనీసం కార్యకర్తలను కలిసే సమయం జగన్ కు లేదు. ప్రజలను కలిసే ఓపిక ఆయనకు ఎక్కడుంది? 

ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లు ఆయన నివసించే ప్రాంతంలో ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? పైగా ఆయన ఇంటిదారి కోసం పేదోళ్ల ఇళ్లను కూల్చారు. పేదలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం మాది. 

మాతో అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మా ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోంది. తప్పుచేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తిలేదని స్పష్టంచేశారు. 

Nara Lokesh
Red Book
Andhra Pradesh Politics
YCP
Jagan Mohan Reddy
Lokesh's Red Book Remarks
Andhra Pradesh Assembly
Political Controversy
Kaniigiri
Reliance CGB Plant
  • Loading...

More Telugu News