Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

Kiren Rijiju Introduces Wakf Board Amendment Bill in Rajya Sabha

  • రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు 
  • వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై కేంద్ర మంత్రి రిజిజు స్పష్టీకరణ
  • వక్ఫ్ బోర్డులలో మహిళలకు ప్రాధాన్యం
  • గిరిజన ఆస్తులకు రక్షణ కల్పిస్తూ వక్ఫ్ బిల్లు సవరణ
  • ఇప్పటికే లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేడు రాజ్యసభలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదం పొందిన మరుసటి రోజే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

వక్ఫ్ ఆస్తులను ముస్లిమేతరులు నిర్వహిస్తారనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయని, అందులో నిజం లేదని రిజిజు స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు భారీ భూ బ్యాంకును కలిగి ఉన్నప్పటికీ ముస్లిం సమాజం ఎలా బాధపడుతోందో సచార్ కమిటీ నివేదిక పేర్కొన్న వైనాన్ని ఆయన ఉటంకించారు.

రాజ్యసభలో రిజిజు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో వక్ఫ్ బిల్లుకు సవరణలు చేసిందని, ఆ తప్పులను తాము తాజాగా చేసిన సవరణలు ఎలా సరిదిద్దుతాయో కూడా వివరించి చెప్పారు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని 2013లో సెలెక్ట్ కమిటీ అంగీకరించిందని, దేశంలోనే ఇది మూడవ అతిపెద్ద భూ యజమానిగా ఉన్నప్పటికీ, మైనారిటీ వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అన్నారు.


వక్ఫ్ బోర్డుల కూర్పు గురించి వివరిస్తూ... కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వక్ఫ్ బోర్డుల పాలకవర్గాల్లో మహిళా సభ్యులను చేర్చడానికి సంబంధించి ఒక ముఖ్యమైన సంస్కరణను తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. కేంద్ర వక్ఫ్ మండలిలో 10 మంది సభ్యులు ఉంటారని, అందులో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, నలుగురు వ్యక్తులు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి వంటి జాతీయ స్థాయి ప్రముఖులు ఉంటారని కిరణ్ రిజిజు వివరించారు. రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారని, అందులో ముగ్గురు ముస్లిమేతరులు ఉండవచ్చని, ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు.

వక్ఫ్ బోర్డులోని సెక్షన్ 40ను రద్దు చేశామని, దీని ద్వారా ఏ ఆస్తి అయినా తమదేనని మతపరమైన సంస్థ క్లెయిమ్ చేసే అధికారం ఉండేదని తెలిపారు. ప్రభుత్వ భూమిని వక్ఫ్ క్లెయిమ్ చేయకూడదని, షెడ్యూల్డ్ తెగల ఆస్తులను మార్చడానికి వీల్లేదని, వాటిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు పెద్ద సవరణలను చేశామని రిజిజు రాజ్యసభకు తెలియజేశారు.

Kiren Rijiju
Wakf Board Amendment Bill
Rajya Sabha
Muslim minority
India
Wakf properties
women's representation
Section 40
Sachar Committee
  • Loading...

More Telugu News