Karnataka High Court: ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించిన కర్ణాటక హైకోర్టు

Karnataka High Court Bans Bike Taxi Services

  • బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధమన్న కర్ణాటక హైకోర్టు
  • వీటిని మోటార్ యాక్ట్ కింద చేర్చేందుకు ప్రభుత్వానికి 3 నెలల సమయమిచ్చిన హైకోర్టు
  • బైక్ ట్యాక్సీలు రోడ్డుపై తిరిగేందుకు వీల్లేదని వ్యాఖ్య

ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ సేవలను కర్ణాటక హైకోర్టు నిషేధించింది. రాబోయే ఆరు వారాల్లో ఈ కంపెనీలన్నీ కార్యకలాపాలను ఆపేయాలని ఆదేశించింది. బైక్ ట్యాక్సీ సేవలను 1988 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇచ్చింది. 

ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రైడ్ హెయిలింగ్ సేవల ఆపరేటర్లు మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. కొందరు బైక్ ట్యాక్సీ డ్రైవర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.

మోటార్ వాహన చట్టం 1988లోని సెక్షన్ 93ని అనుసరించి కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు ఉబర్, ర్యాపిడో, ఓలా బైక్ సర్వీసులు రోడ్డుపై తిరగడానికి వీల్లేదని చెప్పింది. వైట్ నంబర్ ప్లేట్ ఉన్న టూవీలర్స్ కమర్షియల్ వినియోగానికి అనుమతి లేదని తెలిపింది. 

బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధమని... దీనికి సరైన చట్టబద్ధత అవసరమని చెప్పింది. ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా గుర్తించడానికి కావాల్సిన అనుమతులు ఇచ్చేలా రవాణా శాఖకు తాము ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. దీనికి చట్టం అవసరమని చెప్పింది.

Karnataka High Court
Uber
Rapido
Ola
Bike Taxi Ban
Ride-hailing services
Motor Vehicles Act 1988
Two-wheeler taxis
Illegal bike taxis
Karnataka transport
  • Loading...

More Telugu News